»Be Careful With Ott Free Subscription Links If You Click The Banks Are Empty
OTT Free: ఓటీటీ ఫ్రీ అనగానే క్లిక్ చేస్తున్నారు..ఖాతాలు ఖాళీ
ఫ్రీ ఓటిటి లింకులతో జాగ్రత్తాగా ఉండాలి. ఆశపడి క్లిక్ చేశామో మన వ్యక్తిగత సమాచారంతో పాటు మన బ్యాంకులు ఖాళీ అవుతాయి. ఇటివల ఇలాంటి మోసాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అయిన ఓటీటీ(OTT)ల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రీగా ఓటీటీలకు లాగిన్ అవొచ్చని పలు రకాల లింక్ లు ఫోన్లకు వస్తుంటాయి. ఎలాగో ఉచితంగా వస్తుంది కదా అని క్లిక్ చేస్తుంటాము. ఇకపై ఇలాంటి లింక్ లు కనిపిస్తే కాస్త అప్రమత్తం అవ్వాలి అంటున్నారు పోలీసులు. ఓటీటీ ఉచిత(Free OTT) సబ్స్క్రిప్షన్ పేరిట వచ్చే వాట్సాప్ లింకుల పట్ల ప్రజలు జాగ్రత్త పడాలని అత్యాశకు పోయి వాటిని క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన కూడా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ హాట్‌స్టార్‌లకు సంబంధించిన నకిలీ లింకులతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ఎరవేస్తున్నారని తెలిపారు.
ముందు ఫ్రీ అని ఒక వాట్సప్ లింక్ వస్తుంది. అది క్లిక్ చేయగానే సంబంధిత ఓటీటీ ప్లాట్ ఫామ్ యాప్ ను సెల్ఫోన్లో ఇన్స్టాల్ చేయమని చూపుతుందని తెలిపారు. ఇన్స్టాల్ చేయగానే ఓటీపీ కోసం మరొక లింకు వస్తుంది. ఇక ఆ సంఖ్యను ఎంటర్ చేయగానే మొబైల్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందని ఎస్పీ వివరించారు. ఇక సైబర్ నేరగాళ్లు మన ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి లింకులు పంపిస్తే వాటిని క్లిక్ చేయకూడదని అంతే కాదు పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే మెస్సెజ్ లకు రిప్లై ఇవ్వకూడదు అని వివరించారు. ఈ విధంగా ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దీనికి సంబంధించి సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని, నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ గార్గ్ ఈ ప్రకటనలో తెలిపారు.