AKP: వేటూరి సాహితీ పీఠం, ప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగ సినీ పాటల రచయిత కే.శ్యామ్‌ను వేటూరి పురస్కారానికి ఎంపిక చేసాయి. పీఠం వ్యవస్థాపక కార్యదర్శి రామజోగేశ్వర శనివారం పాయకరావుపేటలో ఈ విషయాన్ని తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఈ నెల 29వ తేదీన పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. శ్యామ్ పాటల రచయితగా అనేక అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.
E.G: మల్లవరంలో కోడిపందాల వద్ద దళిత యువకుడు గెల్లా ఆదినారాయణపై జరిగిన దాడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ జవహర్ తీవ్రంగా ఖండించారు. సోమవారం బాధితుడిని పరామర్శించిన ఆయన, అగ్రకులాలకు చెందిన నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
KKD: సీఎం చంద్రబాబు తనకున్న మీడియాను చూసి రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి, YCP కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్నబాబు ఆరోపించారు. సోమవారం రూరల్ వైద్య నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు భజన చేసే ఓ మీడియా సంస్థకు విశాఖలో భూమి, మరో సంస్థకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపించారు. ప్రజలు బాబు ప్రచారం ఎంతో కాలం నమ్మరని.. తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
కడప: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని సోమవారం విస్తృతంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా నేరాలకు ముందస్తు నియంత్రణ సాధించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
VZM: రిపబ్లిక్ డే వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. జనవరి 26న పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.
ATP: గుంతకల్లులో MLA గుమ్మనూరు జయరాం ఇవాళ పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మ అర్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, అలాగే 11.30గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతారన్నారు. మధ్యాహ్నం 1 గంటకు మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలు కేంద్రం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
CTR: జిల్లాలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.1.72 కోట్ల బకాయిలు విడుదల చేసింది. 973 మందికి సబ్సిడీ కింద రావాల్సిన రూ.1,64,83,589 ప్రభుత్వం వారి వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. దీంతో పాటు నాన్ ఫార్మింగ్ సెక్టార్ కింద పట్టుశాఖకు అనుసంధానంగా చేపట్టిన పనులకు గాను రూ.7,31,800 నిధులు పట్టు పరిశ్రమ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు.
KDP: కమలాపురం మండలం కొప్పర్తికి గ్రామానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత మంగళవారం రానున్నట్లు టీడీపీ కార్యాలయం తెలిపింది. కొప్పర్తిలో ఆధ్యాత్మిక సమ్మేళనం (ఇస్తేమా) నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రులు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
CTR: కాణిపాకంలో వెలసిన మణి కంఠేశ్వర ఆలయంలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. మణికంఠేశ్వరాలయంలో వెలసిన సూర్యనారాయణస్వామికి ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వామి కల్యాణ వేదిక వద్ద సూర్య నమస్కారాల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
VZM: ఈ నెల 26 నుంచి 31 వరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఇందు కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, MRO, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు భాగస్వాములుగా పని చేయాలన్నారు. ఈ మేరకు హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయ రంగాల్లో బాలకార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.
CTR: జిల్లాలో ఈనెల 24న స్వచ్చరథాలు ప్రారంభించనున్నట్లు డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. తొలి విడతగా చిత్తూరు, ఐరాల, బంగారు పాల్యంలో స్వచ్ఛ రథాలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారన్నారు. మార్చిలోపు జిల్లాలోని మిగిలిన 24 మండలాల్లో రథాలను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి నిర్వహణ కోసం మండల పరిషత్ నుంచి ప్రతినెల రూ.25 వేలు చెల్లించనున్నట్టు చెప్పారు.
ELR: జీలుగుమిల్లి పట్టిసీమ రహదారి 2వ విడత భూసేకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా జేసీ అభిషేక్ గౌడ అధికారులను సోమవారం ఆదేశించారు. కలెక్టరేట్లోని అధికారులతో జేసీ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరుచేసిందన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 84 కీ.మీ.ల భూసేకరణ చేపట్టామన్నారు.
SKLM: పాతపట్నం మండలం ఎ.ఎస్. కవిటి గ్రామం, చీకటి తోటలో జూదం ఆడుతున్న ఒడిశా పర్లాఖెముండికి చెందిన 9 మంది వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. మధుసూధనరావు సోమవారం తెలిపారు. వారి నుంచి రూ. 29,700 నగదు, 7 సెల్ ఫోన్స్ లు , 6 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
GNTR: రైలుపేటలో ఇంటి పనికి వచ్చి యజమాని నగలు చోరీ చేసిన మంగమ్మ అనే మహిళను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు లక్ష్మీకుమారి తీర్థయాత్రలకు వెళ్తూ ఇంటి తాళాలు ఇవ్వగా, శుభ్రం చేసే నెపంతో మంగమ్మ బంగారాన్ని తస్కరించింది. పోలీసులు నిందితురాలిని గుర్తించి, దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సోమవారం తెలిపారు.
సత్యసాయి: కదిరిలోని వయోజన విద్యా కేంద్రాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. JC భరద్వాజ్‌తో కలిసి అభ్యాసకుల బోధన తీరును పరిశీలించారు. చదువుతోపాటు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. వాలంటీర్ టీచర్ హేమలత విజ్ఞప్తి మేరకు గౌరవభృతి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.