Small Savings Schemes May Frozen If Aadhar Pan Not Submitted By September 30TH
Small Savings Scheme: చిన్న మొత్తాల పొదుపు (Small Savings Scheme) పథకాల్లో జమ చేస్తోన్న వారు విధిగా పాన్, ఆధార్ కార్డును ఈ నెల 30వ తేదీ లోపు సమర్పించాలి. లేదంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి. ఎలాంటి లావాదేవీలు జరగవు. ఆధార్, పాన్ కార్డ్ సమర్పించే వరకు ఖాతాలను నిర్వహించడం కుదరదు. ఇప్పటికే పాన్, ఆధార్ వివరాలను సమర్పించిన ఖాతాదారులు మరోసారి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ ఏప్రిల్ 1వ తేదీ తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి ప్రభుత్వం పాన్ కార్డు తప్పనిసరి చేసింది. కొత్తగా ఖాతాలు తీసుకున్నవారు కూడా ఆధార్, పాన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమయంలో విధిగా.. ఆధార్, పాన్ కార్డు తీసుకున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ సహా ఇతర పథకాలు చిన్న మొత్తాల పొదుపు పథకాల కిందకు వస్తాయి.
నష్ట భయం పెద్దగా భరించలేని చిరుద్యోగులు ఇందులో పొదుపు జమ చేస్తారు. వడ్డీరేట్లను మూడు నెలలకోసారి ప్రభుత్వం సమీక్షిస్తోంది. 2023 జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి కొన్ని పథకాలపై వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లను పెంచింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై వడ్డీరేట్లలో మార్పు చేయలేదు. పీపీఎఫ్ వడ్డీరేటును మాత్రం 2020 ఏప్రిల్ నుంచి 7.1 శాతంగా కొనసాగిస్తోంది.