అనాకాడమీ చేసిన చిన్న పొరపాటుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది #UninstallUnacademy అంటూ సోషల్ మీడియాలో ట్రైండ్ క్రియేట్ చేశారు. చదువుకున్న నేతలకే ఓటు వేయాలని ఓ ఉపాధ్యాయుడు చెప్పిన నేపథ్యంలో అతన్ని తొలగించారు. దీంతో ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
Uninstall Unacademy is trending on Twitter the reason
అనాకాడమీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పలు రకాల కారణాలతో #UninstallUnacademy అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. ఇటివల చదువుకున్న వారికి మాత్రమే ఓటు వేయాలని చెప్పిన వ్యక్తి కరణ్ సాంగ్వాన్ తొలగింపు తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అయితే ఈ అంశంపై అనాకాడమీ సహ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా కరణ్ సాంగ్వాన్‌ను తొలగించామని వెల్లడించారు. అంతేకాదు తాము నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాము మా విద్యావేత్తలందరికీ కఠినమైన ప్రవర్తనా నియమావళిని(rules) అమలు చేసామని అన్నారు. విద్యార్థులను తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున వ్యక్తిగత అభిప్రాయాలను తరగతి గదిలో పంచుకోకూడదని సైనీ వివరించారు. తరగతి గది వారి వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడానికి స్థలం కాదని, ఎందుకంటే వారు వాటిని తప్పుగా ప్రభావితం చేయవచ్చని స్పష్టం చేశారు.
ఇప్పుడు తాజాగా మళ్లీ బబితా మేడమ్ కూడా చదువుకున్న వారికే ఓటు వేయాలని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం #UninstallUnacademy అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అంతేకాదు ఈ ఎడ్ టెక్ సంస్థ తీసుకున్న చర్య తర్వాత, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు సహా అనేక మంది నెటిజన్లు ఈ కంపెనీ మొబైల్ అప్లికేషన్‌ను అన్ఇన్స్టాల్ చేయమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశంపై అనేక మంది కామెంట్లు చేయడంతో ప్రస్తుతం అనాకాడమీ వివాదాల్లో చిక్కుకున్నట్లైంది.
ఇప్పటికే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) ఈ ఎడ్టెక్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. చదువుకున్న రాజకీయ నాయకులకు ఓటు వేయమని ప్రజలను ప్రోత్సహించడం నేరమా అంటూ ప్రశ్నించారు. విద్యావంతులకు ఓటు వేయమని విజ్ఞప్తి చేయడం నేరం ఎలా అవుతుందన్నారు? ఎవరైనా నిరక్షరాస్యులైతే, వ్యక్తిగతంగా తాను అతన్ని గౌరవిస్తానని చెప్పారు. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకుడదని అన్నారు. ప్రస్తుతం 5జీ టెక్నాలజీ వచ్చిన యుగంలో కూడా నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధుల ద్వారా ఆధునిక భారత్ ను ప్రోత్సహించ లేరని ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.