Durgam Chinnaiah:ఎమ్మెల్యే చిన్నయ్యకు మరో షాక్.. శేజల్ తో ఎంపీల చర్చలు
ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని తన కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Durgam Chinnaiah:ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని తన కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చిన్నయ్య ప్రభుత్వ భూమిని తన భూమి అని అమ్మడంతో పాటు లైంగికంగా తనను వేధించారని శేజల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దాదాపు పదిహేను రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ న్యూఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిరాహార దీక్ష కూడా చేపట్టారు. జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఆమె ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేశారు.. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి కూడా శేజల్ ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి ఆమె తెలంగాణ భవన్ లో నిరాహార దీక్ష చేపట్టారు. ఇదిలా ఉంటే శేజల్‌తో బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ శేజల్, ఆదినారాయణలతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసిన డబ్బులు వాపస్, తమపై ఉన్న కేసుల ఎత్తివేత, ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. తప్పు చేసిన వారిపై పార్టీలో క్రమశిక్షణ చర్యలుంటాయని వారు చెప్పినట్లు.. అలాగే ఆమెకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతకు ముందు ఆమె పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని శేజల్ ఆరోపిస్తున్నారు. అందుకు సంబందించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించినట్లు శేజల్ ఆరోపించారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐని కోరారు.