Telangana Government Take A Key Decision On 111 GO
111 GO:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 111 జీవో ఎత్తివేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే జీవో 111 గ్రామాలకు వర్తించనుంది. తెలంగాణ సచివాలయంలో ఈ రోజు తొలి మంత్రివర్గ సమావేశం సుధీర్ఘంగా జరిగింది. మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు కొనసాగింది. తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు మీడియాకు వివరిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి చర్చించారు. జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కోరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కులవృత్తుల బలోపేతం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. వృత్తి చేసేవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయనుంది. రాష్ట్రంలో 38 డీఎంహెచ్‌వో పోస్టులు మంజూరు చేసింది. కొత్తగా 40 మండలాల్లో పీహెచ్సీ మంజూరు చేసింది.
హుస్సేన్ సాగర్‌ను గోదావరి జలాలతో నింపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జైన్ కమ్యూనిటీ వారిని మైనార్టీ కమిషన్ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 10 కొత్త పోస్టులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
111 జీవో అంటే..
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారు. హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాలను ఇవే తీర్చేవి. జలాశయాలను కాపాడుకోవడం కోసం 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. జలాశయాల్లోని నీరు కలుషితమైతే.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని జీవో తీసుకొచ్చింది. జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లాలో 7 మండలాలకు చెందిన 84 గ్రామాలు జీవో పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జీవో అర్థరహితం అని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ నగర అవసరాలను తీర్చేందుకు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోంది. మరో 100 ఏళ్ల తాగునీటికి కొరత ఉండదు. నిపుణుల కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తామని సీఎం ప్రకటించగా.. ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.