తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారాలతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం మరింత పెరుగుతూ వస్తోంది. తాజాగా వార్షిక బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇది సంప్రదాయంగా వస్తోంది. కానీ గవర్నర్ తో విబేధాల కారణంగా ఆ సంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే సాగుతుందని తెలుస్తోంది. వెసులుబాటును ఆసరాగా చేసుకుని గవర్నర్ ప్రసంగాన్ని ఎత్తి వేస్తున్నారు. గత సమావేశాలు ఇదే తీరున జరిగాయి. ప్రభుత్వం చెబుతున్న వివరణ ప్రకారం.. గత శాసనసభ, మండలి సమావేశాలు ఇంకా ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) కాలేదు. ప్రొరోగ్ చేయకపోవడంతో నాటి సమావేశాలకు కొనసాగింపుగానే ప్రస్తుత సెషన్ జరుగుతుందని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. 2021 సెప్టెంబర్ లో ఎనిమిదో పర్యాయం సమావేశాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వాటిని ప్రొరోగ్ చేయలేదు. అనంతరం జరిగిన రెండు విడతలు సమావేశాలు 8వ పర్యాయంలో జరిగిన సమావేశాలుగానే గుర్తించారు.
ప్రస్తుతం జరుగనున్న బడ్జెట్ సమావేశాలు కూడా 8వ పర్యాయంలో జరుగుతున్నవేనని సాంకేతికంగా ప్రభుత్వం చెబుతున్నది. దీన్ని బట్టి చూస్తే 8వ పర్యాయంలో శాసనసభ, మండలి సమావేశాలు 4 విడతలుగా జరుగుతున్నాయి. న్యాయపరంగా చిక్కులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో గవర్నర్ పాత్రను నామమాత్రంగా చేస్తోంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుంటే రాజకీయంగా తీవ్ర వివాదం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు దీనిపై పోరాటం చేసే అవకాశం ఉంది.