బీఆర్ఎస్ పార్టీకి (Bharat Rashtra Samithi- BRS Party) వ్యతిరేకంగా.. పార్టీ అధినేతను దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ (Suspend) చేసింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో వీరిద్దరూ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వారిపై వేటు వేశారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరిపై వేటుతో ఉమ్మడి పాలమూరు, ఖమ్మం జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్ల నుంచి వీళ్లు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండడంతో పార్టీ వేటు వేసింది.
సీనియర్ నేత జూపల్లి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే (Mahabubnagar) కీలక నాయకుడిగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1999, 2004, 2009, 2012 ఉపఎన్నికలు & 2014లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి ఉమ్మడి ఏపీలో వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోనూ మంత్రిగా పని చేశారు. 2018లో మాత్రం ఓటమిని చవిచూశారు. కొల్లాపూర్ (Kollapur) నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) ఆ తదనంతరం గులాబీ కండువా కప్పుకున్నాడు. హర్షవర్ధన్ రెడ్డి రాకతో జూపల్లి ప్రాధాన్యం తగ్గింది. సీఎం కేసీఆర్ (KCR) ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తూ పార్టీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో తన వర్గానికి విలువ లేకపోవడంతో కొన్నాళ్లుగా జూపల్లి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కొల్లాపూర్ తో పాటు సరిహద్దు నియోజకవర్గాల్లో జూపల్లి సొంత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. అంతేకాకుండా ఆదివారం కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి పాల్గొన్నాడు. ఆ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.
పొంగులేటి వేరే కుంపటి
ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం (Khammam) నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అనంతరం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే 2019లో మళ్లీ ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో నామా నాగేశ్వర్ రావుకు (Nama Nageswara Rao) అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి పొంగులేటికి ప్రాధాన్యం దక్కలేదు. పార్టీ పరంగా, పదవుల పరంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో పొంగులేటి పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రారంభించాడు. ఇక కొత్తగూడెం సభలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం వేటు వేసింది.