»Summer Effect Electricity Emergency Declared By Govt Of India
Power Emergency కేంద్రం సంచలన నిర్ణయం.. విద్యుత్ ఎమర్జెన్సీ ప్రకటన
గతేడాది విద్యుత్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకోకపోవడం.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా విద్యుత్ కష్టాలు తప్పేట్టు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన రావడం అంటే దేశంలో విద్యుత్ సంక్షోభం ఉన్నట్టే. అనధికారికంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. గతేడాదిని చూసి నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఉంటే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి కొంత మెరుగయ్యేది.
గతేడాది దేశంలో విద్యుత్ సంక్షోభం (Power Shortage) తలెత్తిన విషయం తెలిసిందే. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండడంతో దానికి తగ్గట్టు విద్యుత్ (Electricity) సరఫరా చేయలేకపోయింది. తెలంగాణ (Telangana)తో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతేడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ అత్యయిక పరిస్థితి (Power Emergency) ప్రకటించింది. వేసవి కాలం రావడంతో కేంద్ర ప్రభుత్వం (Govt of India) ముందే అప్రమత్తమైంది. ఈ క్రమంలో విద్యుత్ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ (Power Demand) రోజురోజుకు పెరుగుతోంది. మహాశివరాత్రి ముగియడంతో ఇక ఎండలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత్తలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ డిమాండ్ అధికం కానుంది. విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగనుందనే అంచనాలు ఉండడంతో విద్యుత్ చట్టం-2003 (Power Act-2003)లోని సెక్షన్ 11 కింద దేశంలో విద్యుత్ అత్యయిక పరిస్థితిని సోమవారం కేంద్రం విధించింది. దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఈ ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది. చేసిన విద్యుత్ ఉత్పత్తిని పవర్ ఎక్స్చేంజీలకు సరఫరాలను చేయాలని స్పష్టం చేసింది.
ఏప్రిల్ (April) నెలలో దేశంలో విద్యుత్ డిమాండ్ గతంలో కన్నా అధికంగా ఉండనుందని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఏకంగా 249 గిగావాట్స్ (2,29,000 మెగావాట్లు)కు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనాకు వచ్చింది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని పేర్కొంది. ఉత్పత్తి అయిన విద్యుత్ ను తప్పనిసరిగా బహిరంగ మార్కెట్ (ఓపెన్ యాక్సెస్)లో విక్రయించాలని పేర్కొంది. ఈ ప్రకటనతో దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తాయి. మళ్లీ విద్యుత్ అత్యయిక పరిస్థితి ఎత్తి వేసే వరకు విద్యుత్ కేంద్రాలు కేంద్ర పరిధిలోనే ఉంటాయి. గతేడాది విద్యుత్ చట్టం ఆధారంగానే దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇవే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
గతేడాది విద్యుత్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకోకపోవడం.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా విద్యుత్ కష్టాలు తప్పేట్టు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన రావడం అంటే దేశంలో విద్యుత్ సంక్షోభం ఉన్నట్టే. అనధికారికంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. గతేడాదిని చూసి నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఉంటే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి కొంత మెరుగయ్యేది.
కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో విద్యుత్ కొరత ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గతేడాది నెలకొన్న సంక్షోభం నుంచి ఏం నేర్చుకున్నారని కాంగ్రెస్ (Congress Party), తృణమూల్ (Trinamool Congress Party), ఆప్ పార్టీ (Aam Aadmi Party)లు ప్రశ్నించాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా బీజేపీ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. భవిష్యత్ ప్రణాళికలు లేకుండా సాగిస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.