ఏపీ హైకోర్టు(Ap High Court) వాహనదారులకు సంబంధించి సంచలన తీర్పును వెల్లడించింది. ఇన్సూరెన్స్ ప్రమాద బీమా అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీ పాలనీ అనేది తీసుకున్నప్పుడు అది బైక్ వెనక సీటుపై కూర్చొన్న వ్యక్తికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. బాధితులు అప్పీల్ చేయకపోయినా పరిహారం పెంచే అధికారం ఉన్నత న్యాయస్థానానికి ఉందని వెల్లడించింది.
2004 నవంబరు నెల అనంతపురం జిల్లాలో బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. శివశంకర్, శివకేశవులు ఓ బైక్పై ప్రయాణిస్తున్నారు. అలాగే సాకే ముత్యాలు, దాసరి బోడప్ప అనే వారు కూడా మరో బైక్ పై ప్రయాణిస్తున్నారు. ముందు వెళుతున్న బైక్ను సాకే ముత్యాలు ఢీకొట్టడంతో నలుగురూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో బోడప్ప చనిపోయాడు. కుటుంబీకులు పరిహారం కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ నిరాకరించడంతో జిల్లా కోర్టును బాధితులు ఆశ్రయించారు.
అక్కడ వారికి అనుకూలంగా తీర్పు చెప్పిన ట్రైబ్యునల్ రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని 2008లోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును అదే ఏడాది హైకోర్టులో యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ సవాల్ చేస్తూ వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ వెంకటరమణ వారి వాదనలను తోసిపుచ్చారు. ద్విచక్ర వాహనానికి ‘ప్యాకేజీ పాలసీ’ తీసుకొని ఉంటే వెనుక సీటులో ఉన్నవారికీ ప్రమాద బీమా వర్తిస్తుందని తీర్పునిచ్చారు. అంతేకాదు, పరిహారాన్ని కూడా రూ.2 లక్షల నుంచి రూ.9.18 లక్షలకు పెంచిన న్యాయమూర్తి ఆ సొమ్మును వాహన యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా చెల్లించాలని జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆదేశాలు ఇచ్చారు.