»Restrictions On Sim Card Connections Center Made Police Verification Mandatory
SIM Cards: సిమ్ కార్డు కనెక్షన్లపై ఆంక్షలు.. పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసిన కేంద్రం!
ఇకపై సిమ్ కార్డు తీసుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కేవైసీ పూర్తయిన తర్వాతే సిమ్ మంజూరు అవుతుంది. తాజాగా సిమ్ కార్డు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది.
సిమ్ కార్డు డీలర్లకు కేంద్రం షాకిచ్చింది. ఇకపై వారికి పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపేసినట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లపై ఆంక్షలు విధిస్తూ ప్రకటన చేశారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..ప్రస్తుతం కొంత మంది సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ లేకుండానే సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇకపై అలాంటివి జరగవన్నారు. సిమ్ డీలర్లకు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. వెరిఫికేషన్ తర్వాత పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారన్నారు. వారంతా కూడా వెరిఫికేషన్ పూర్తి చేయడానికి తగిన సమయం ఇస్తున్నట్లు తెలిపారు. బల్క్ కనెక్షన్లను తొలగించి త్వరలోనే బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 52 లక్షల మొబైల్ కనెక్షన్లను సర్కార్ డిస్కనెక్ట్ చేశామన్నారు. మే 2023 వరకూ సిమ్ కార్డ్ డీలర్లపై 300 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.