కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దివంగత జయలలిత మొదలు పదేళ్ల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్, రెండు నెలల క్రితం లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ పైన అనర్హత వేటు వరకు ఏదీ పెద్దగా చర్చకు రాలేదు. కానీ రాహుల్ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారడం.. చట్టబద్ధంగా జరిగిన ఈ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనర్హత వేటు పడటం రాహుల్ గాంధీ పైనే మొదటిసారి కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ దీనిపై నిరసనలు వ్యక్తం చేయడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. 2013లో స్వయంగా రాహుల్ గాంధీయే రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే.. ఆర్డినెన్స్ ను చించేసి మరీ సమర్థించారని, ఇప్పుడు ఆయన వరకు వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తించడం ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అనర్హత పైన (Rahul Gandhi Disqualified) అగ్రరాజ్యం అమెరికా (America) కూడా స్పందించింది (US watching Rahul Gandhi’s case). రాహుల్ గాంధీ కేసును తాము గనిస్తున్నామని అమెరికా పేర్కొన్నది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్ తో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
ఏ ప్రజాస్వామ్యానికి అయినా చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు అని పేర్కొన్నది. భారత న్యాయస్థానాలలో రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని, భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి నిబద్ధతను కలిగి ఉన్నామని తెలిపింది. రెండు దేశాలకు కీలక అంసాలైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా ప్రాముఖ్యతను నిత్యం హైలెట్ చేస్తూనే ఉంటామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు.
మోడీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే సదరు చట్టసభ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుంది. దీని ప్రకారమే రాహుల్ పైన లోకసభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అయితే రాహుల్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దీనిని పక్కన పెట్టి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఒత్తిడిలో…
రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడం లేదని దీంతో వారు ఒత్తిడిలో ఉన్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ప్రతిష్టను మసకబార్చే వరకు తాను ఇలా దాడి చేస్తూనే ఉంటానని స్వయంగా రాహుల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసారన్నారు. కానీ వారు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రధాని మోడీ పైన సాధారణ ప్రజలకు, తమలాంటి వారికి ఉన్న అభిమానాన్ని తగ్గించలేకపోయారన్నారు.
రాహుల్ కేసులో తీర్పు వెలువడిన వెంటనే అనర్హత వేటు పడటం సాధారణమేనని, ఈ వ్యవహారంలో కేంద్రం ప్రదర్శించిన వేగానికి ఉసెన్ బోల్డ్ కూడా ఆశ్చర్యపోతాడని కాంగ్రెస్ నేత చిదంబరం ఎద్దేవా చేశారు. అయితే గతంలో లాలూ ప్రసాద్, ఇటీవలె లక్షద్వీప్ ఎంపీలపై ఇలాగే వేటు పడిన విషయాన్ని చిదంబరం గుర్తుంచుకోవాలని బీజేపీ గుర్తు చేస్తోంది.