KDP: కడప నగరంలోని LIC సర్కిల్ వద్ద ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ ఎస్సై అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృత్యువుతో పారాడుతూ ఇవాళ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. అయితే ఆయన ఎవరూ అనేది తెలీదని.. ఆచూకి తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.
GNTR: ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన బుధవారం బ్రాడీపేటలోని రైల్వే ట్రాక్ వద్ద చోటుచేసుకుంది. కంభం నుంచి గుంటూరు ప్రయాణిస్తున్నట్లు మృతిచెందిన వృద్ధుడి వద్ద టికెట్ ఉందని, గళ్ళ లుంగీ, తెల్లచొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు గుంటూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పాత కూచిపూడి పల్లికి చెందిన బత్తుల వెంకటరమణ ఇంట్లో నవంబర్ 4వ తేదీన దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పామూరు పట్టణానికి చెందిన వేముల అఖిల చోరీ చేసిన బంగారమును అమ్ముకొనుటకు ఒంగోలు వెళ్లుచుండగా కనిగిరి డిపో వద్ద బుధవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
W.G: ఇరగవరం మండలం రేలంగి రైల్వే గేటు సమీపంలో ఇటీవల రైలు ఢీకొని మృతి చెందిన ఘటనలో మృతుడి ఆచూకీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామానికి చెందిన గుండే రాజశేఖర్ (34)గా గుర్తించినట్లు చెప్పారు. ఈనెల 22 రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన రాజశేఖర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి అతివేగంగా రోడ్డు పక్కన ఉన్న వాటర్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ఎంగన్నపల్లికి చెందిన భాస్కర్ 24 మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ సురేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
VSP: నక్కపల్లి నుంచి బైక్ పై మద్యం బాటిల్స్ తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ కుమారస్వామికి ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు నక్కపల్లి ఆర్చ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో జానకయ్యపేటకు చెందిన కె లోవరాజు వద్ద 71 మద్యం బాటిల్స్ లభ్యం అయ్యాయి. లోవరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్నిబాబు తెలిపారు.
ఎన్టీఆర్: తిరువూరు మండలం టేకులపల్లి గ్రామంలో విద్యుదాఘతంతో బుధవారం గేదె మృతి చెందింది. బాధిత పాడి రైతు సత్యనారాయణ వివరాల మేరకు.. గేదెను మేపడానికి తోలుకెళ్లిన సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. రూ.90 వేల పాడి గేదె మృతి చెందడంతో నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
NLR: మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా వద్ద ఉదయగిరి ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నుంచి ఓ బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 37 మిలిటరీ ఫుల్ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ లక్ష్మణ్ స్వామి తెలిపారు.
పంజాబ్‌లో సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి.. ఆ తర్వాత వారిని దోచుకుని సీరియల్ కిల్లర్ హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. 18 నెలల్లో 11 మందిని హత్య చేసినట్లు వెల్లడించారు. నిందితుడు హోషియార్‌పూర్ జిల్లా గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన రామ్‌సరూప్‌గా గుర్తించారు. హత్యకు గురైన వారందరూ పురుషులే అని పేర్కొన్నారు.
చెన్నై అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తన ప్రియుడితో మాట్లాడుతున్న సమయంలో, ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ప్రియుడిని కొట్టి, విద్యార్థినిపై లైంగిక దాడి చేశారు. డిసెంబర్ 23 సాయంత్రం ఈ ఘటన జరగగా.. ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
W.G: ఉండి మండలం యండగండి పార్సిల్లో డెడ్ బాడీ కేసు రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని జిల్లా ఎస్సీ అద్నాన్ నయీం అన్నారు. ఈ కేసులో మీడియా సహకరించారని ఎస్పీ బుధవారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుందని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని రెండు మూడు రోజుల్లోనే నిందితులను ప్రకటిస్తామని అన్నారు.
TPT: రేణిగుంటలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సీఐ శరత్ చంద్ర కథనం.. రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని మామండూరు సమీపంలో గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులు (25) బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కొత్తూరు(సి) గ్రామానికి చెందిన ఉబ్బెపల్లి సుకన్య (24) ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఉబ్బపెల్లి గణేష్‌తో మూడేళ్ల కింద వివాహం జరిగింది. కాపురం సాఫీగా సాగుతుండగా ఆకస్మికంగా సుకన్య ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
KRNL: ఆదోని పట్టణ శివారులోని ఆస్పరి రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారం తాలుకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు ఆస్పరి వెళ్లే దారిలో గొర్రెల షెడ్డులో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
కజకిస్థాన్‌లో ఓ ప్రయాణికుల విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 67 మంది ప్రయాణికులు ఉన్నారు. తాజాగా ఈ ఘటనలో 42 మంది మృతి చెందినట్లు అధికారుల వెల్లడించారు.