ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీ20 తర్వాత వన్డే మ్యాచుల్లో భారత్ మొదటి స్థానంలోకి చేరుకోనుంది. అంతేకాకుండా వన్డే చరిత్రలోనే కివీస్ పై టీమిండియా మూడోసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్ల క్రితం 2010లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో టీమిండియా ఈ ఘనతను సాధించింది.
5 మ్యాచుల సిరీస్ లో భారత్ అన్ని మ్యాచులూ గెలిసి న్యూజిలాండ్ ను ఓడించింది. అంతకు ముందు 1988లో కూడా 4 మ్యాచుల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్ లో ఇంగ్లండ్ జట్టు నంబర్ 1లో కొనసాగుతోంది. రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఇకపోతే మూడో స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ మూడో స్థానం నుంచి ఒకటో స్థానానికి చేరే అవకాశం ఉంది. టీ20లో ఇప్పుడు భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే టెస్టుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.