ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఘటనలో వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(Ys Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం తన నివాసం నుంచి సిట్ కార్యాలయానికి ఆమె వెళ్తుండగా అనుమతి లేదంటూ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే పోలీసులపై వైఎస్ షర్మిల దాడి చేశారు.
పోలీసులపై వైఎస్ షర్మిల(Ys Sharmila) దాడి చేయడంతో ఆమెపై ఐపీసీ సెక్షన్లు 332, 353, 509, 427 కింద అధికారులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు. ఆమెను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైఎస్ షర్మిల(Ys Sharmila) అరెస్టుతో నాంపల్లి కోర్టు వద్ద భారీ సంఖ్యలో వైఎస్ఆర్టీపీ(YSRTP) నేతలు చేరుకున్నారు. ఈ తరుణంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మరోవైపు షర్మిలకు జడ్జి రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరామర్శించారు. షర్మిల అరెస్ట్ ఘటనపై ఆమె సోదరుడు వైఎస్ జగన్ ఇంత వరకూ స్పందించలేదు.