Avinash reddyకి సుప్రీంకోర్టులో షాక్. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేత
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
Avinash reddy:వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (Avinash reddy) సుప్రీంకోర్టులో (Supreme court) చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వివేకా (viveka) కూతురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ రోజు పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (supreme court) అసహనం వ్యక్తం చేసింది. విచారణ సంస్థ సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సాంప్రదాయాలకు దారితీస్తాయని తెలిపింది. వివేకా హత్య కేసు విచారణ గడువును కూడా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ లోపు స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సీబీఐకి ఇదివరకు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణ క్రమంలో ఉండటం.. అవినాష్ సహకరించకపోవడంతో.. ఆ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగించింది.
వివేకా హత్య కేసు (viveka murder case) విచారణలో సీబీఐ స్పీడ్ పెంచింది. అవినాష్ అనుచరుడు ఉదయ్.. తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) అరెస్ట్ చేసింది. ఈ కేసులో తనను ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనని భావించి.. అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు సంబంధించి పిటిషన్ వేశారు. సీబీఐ- అవినాష్ తరఫు వాదనలు విని ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రోజు తుది తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో అవినాష్‌కు ఊరట కలిగింది.
హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులపై వివేకా కూతురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఈ రోజు తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ గడువును మరో 2 నెలలు పెంచింది. జూన్ 30వ తేదీన స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సీబీఐని ఆదేశించింది.