Covid19: దేశంలో పెరిగిన కరోనా కేసులు, కేంద్రం హైలెవల్ మీటింగ్
భారత్ లో మరోసారి కరోనా కేసులు (Coronavirus cases) పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో 6050 కొత్త కేసులు నమోదయ్యాయి.
భారత్ లో మరోసారి కరోనా కేసులు (Coronavirus cases) పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో 6050 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజున నమోదైన 5335 కేసుల కంటే ఇది 13 శాతం అధికం. గత ఆరు నెలల కాలంలో ఒక రోజులో అత్యధిక పెరుగుదల నమోదు కావడం ఈ రోజే. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత మొదటిసారి ఐదువేల కేసుల మార్కును ఇటీవల దాటింది. కొత్తగా 1,78,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6050 మందికి వైరస్ సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 28,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, గత ఇరవై నాలుగు గంటల్లో 14 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ముగ్గురు, కర్నాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కరోనా కారణంగా ఈ మూడేళ్ల కాలంలో మొత్తం మరణాలు 5,30,943కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 220 కోట్లకు పైగా వ్యాక్సీన్ డోసులు పంపిణీ అయ్యాయి.
కరోనా వ్యాప్తి ఢిల్లీ, కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, వైద్య నిపుణులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4,47,45,104 (4.47 కోట్లు)కు చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 0.06 శాతానికి చేరుకున్నాయి.