తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలు రాజకీయ వివాదానికి కారణమైంది. పార్టీలకతీతంగా సజావుగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలను పార్టీలు రాజకీయం చేశాయి. తెలంగాణలో అది తీవ్రం కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదేస్థాయిలో జరిగింది. రాజ్ భవన్ వేదికగా సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ మేరకు రాజ్ భవన్ పలువురికి ఆహ్వానాలు పంపింది. విజయవాడలోని రాజ్ భవన్ లో జరిగిన వేడుకకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు హాజరయ్యారు. కాగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు డుమ్మా కొట్టారు. దీంతో సీఎం జగన్ ఒంటరివాడిగా మిగిలిపోయాడు.
గతేడాది నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాగా ఈసారి గైర్హాజరయ్యారు. ఆయన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభిస్తుండడంతో ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో చంద్రబాబు రాలేకపోయారు. ఇక పవన్ కల్యాణ్ కూడా రాజకీయ పర్యటనలతో బిజీగా ఉండడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తున్నది. జగన్ తో పాటు మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.