ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా… అందరూ గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. ఇటీవల మూడో తరగతి చిన్నారి కూడా… గుండెపోటుతో కన్నుమూశాడు. కాగా.. తాజాగా… ఓ వధువు… పెళ్లి మండపంపైనే కన్నుమూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లక్నో నగరంలోని బడ్వానా గ్రామానికి చెందిన రాజ్ పాల్ కుమార్తె శివంగి(20) అనే యువతికి అదే గ్రామానికి చెందిన వివేక్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు వారి పెళ్లిని ఘనంగా జరిపించాలని అనుకున్నారు. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేశారు. వధూవరులు మండపం పై కూర్చున్నారు. మరి కొద్ది నిమిషాల్లో వరుడు.. తాళి కట్టాలి. అప్పటికే వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. అంతే.. వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి వెంటనే తరలించారు.
కాగా, గుండెపోటుతో ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ధాంతపోయారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. కళ్ల ముందే పెళ్లి కూతురు గుండెపోటుతో చనిపోవడంతో పెళ్లికి వచ్చిన వారంతా షాక్ తిన్నారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న ఆ మండపంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వధువు, వరుడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు.