Bomb Threats: తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సుమారుగా అయిదు పాఠశాలలకు ఈరోజు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు తెలిపారు. అన్నా నగర్, జేజే నగర్, డీఏవీ గోపాలపురంలోని చెన్నై పబ్లిక్ స్కూల్స్, ప్యారీస్లోని సెయింట్ మేరీస్ స్కూల్, ఆర్ఏ పురంలోని చెట్టినాడు విద్యాశ్రమంకు ఈరోజు ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి.
గుర్తు తెలియని వ్యక్తులు ఆయా పాఠశాలలకు ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఆ పాఠశాలలను తనిఖీ చేశారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముంబైలోని సుమారు 6 ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అంతకు ముందు బెంగళూరులోని దాదాపు 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.