ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి, తప్పించుకున్నాడు. అతను తప్పించుకోవడానికి పపల్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి సహకరించినట్లుగా భావిస్తున్నారు.
How Amritpal Singh escaped.. see this CCTV footage
ఖలిస్థాన్ వేర్పాటువాద (khalistan movement) సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ (amritpal singh) పోలీసులకు చిక్కినట్లే చిక్కి, తప్పించుకున్నాడు. అతను తప్పించుకోవడానికి పపల్ ప్రీత్ సింగ్ (papalpreet singh) అనే వ్యక్తి సహకరించినట్లుగా భావిస్తున్నారు. అమృత్ పాల్ కు (amritpal singh) ఇతను మార్గదర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. ఈ పపల్ ప్రీత్ కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో (ISI) సన్నిహత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని (khalistan movement) విస్తరించి, పంజాబ్ లో (Punjab) గతంలో వలె నిప్పు రాజేసేందుకు ఐఎస్ఐ నుండి ఎప్పటికప్పుడు అతనికి ఆదేశాలు అందుతున్నట్లు గుర్తించారు. అమృత్ పాల్ బైక్ పైన వెళ్తున్న ఫోటోను పంజాబ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ బైక్ నడిపింది పపల్ ప్రీత్ గా చెబుతున్నారు విచారణ అధికారులు. అమృత్ పాల్ పరారీకి సహకరించిన నలుగురు వ్యక్తులను విచారించారు. దీంతో చాలా అంశాలు వెలుగు చూశాయి.
పంజాబ్ లో స్థానిక గ్యాంగులను నడిపే మన్ ప్రీత్ సింగ్, గుర్ దీప్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ ను సమకూర్చారు. వారు ఓ గురుద్వారా వద్దకు నిందితుడిని తీసుకు వెళ్లారు. అమృత్ పాల్ అక్కడ దుస్తులు మార్చుకొని, బైక్ పైన పారిపోయినట్లు విచారణలో తెలిపారు. అతను పారిపోవడానికి ముందు ముప్పావు గంట పాటు గురుద్వారాలో గడిపాడు. నలుగురు అనుచరులతో కలిసి శనివారం మధ్యాహ్నం ఒకటి గంటల సమయానికి గురుద్వారకు చేరుకున్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నట్లు తమకు తెలియదని, తుపాకీ చూపించి దుస్తులు అడిగితే ఇచ్చామని, తమ ఫోన్ కూడా తీసుకొని, వెళ్లే ముందు ఇచ్చారని గురుద్వారాకు వెళ్లిన ఓ వ్యక్తి చెప్పాడు.
అమృత్ పాల్ శనివారం వాహనాలను మార్చి పోలీసుల నుండి తప్పించుకున్నాడు. పింక్ టర్బన్, గాగుల్స్ ధరించి స్వయంగా అతను కూడా బైక్ నడిపాడు. తనను పోలీసులు గుర్తు పట్టకుండా గాగుల్స్, దుస్తులను మార్చాడు. ఆ తర్వాత జలంధర్ టోల్ ప్లాజా వద్ద ఎస్యూవీలో వెళ్తున్నట్లుగా గుర్తించారు. అతని అరెస్టుకు సహకరించాలని పోలీసులు… ప్రజలను కోరుతున్నారు. ఇందుకు సంబంధించి అతని ఫోటోలను విడుదల చేసింది.
అమృత్ పాల్ పైన మరో కేసు
అమృత్ పాల్ పైన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇద్దరు డీఎస్పీలు సహా ఓ పోలీస్ బృందం అమృత్ సర్ జిల్లాలోని అమృత్ పాల్ సింగ్ స్వగ్రామానికి వెళ్లి, కొందరు కుటుంబ సభ్యులను కలిసింది. నిందితుల్లో ఏడుగురిని ఖైదు చేసిన అసోంలోని డిబ్రూగడ్ సెంట్రల్ జైల్ కు తరలించారు. పోలీసులు ఐదు రోజులుగా అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. పంజాబ్ తో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లో కూడా అతని కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పోలీసులు అతనిపై లుకౌట్ సర్క్యులర్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు.