»After 8 Months The Number Of New Corona Cases In The India Has Crossed 12 Thousand
Covid Update: 8 నెలల తర్వాత దేశంలో కొత్తగా 12 వేలు దాటిన కరోనా కేసులు
భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో గత 24 గంటల్లో 12,591 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇవి సుమారు ఎనిమిది నెలల తర్వాత అత్యధికంగా నమోదు కావడం విశేషం. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 65,286కు చేరుకున్నారు. గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
మరోవైపు ఒకే రోజులోనే 40 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇందులో కేరళ 11 మరణాలు, ఢిల్లీలో ఆరుగురు నమోదు కాగా..మొత్తం మరణాల సంఖ్య 5,31,230కి పెరిగింది. ఇంకోవైపు రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతం కాగా వీక్లీ పాజిటివిటీ రేటు 5.32 శాతంగా నమోదైంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.15 శాతం క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
దీంతోపాటు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయన పరీక్షలు చేయించుకోగా..కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.