విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని తెలిపారు.
YS Sharmila: విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలో జరిగే విధంగా ఎంపిక జరగదని షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం ఇలా ఏ విషయంలో కూడా ఏపీకి న్యాయం జరగలేదు. కేవలం అన్యాయం మాత్రమే జరిగిందన్నారు. రెండు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని షర్మిల తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాలు అని డ్రామా చేశారని విమర్శించారు. 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదన్నారు. రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా, ఒక్కో మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తూ పెట్టుబడిపై 50 శాతం అధికంగా మద్దతు ధర ఇచ్చే పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వృద్ధులకు నెలకు రూ.4 వేలు ఫించను ఇస్తామని షర్మిల తెలిపారు.