కర్నూలు జిల్లాకి అన్యాయం చేసిన ఘనత టీడీపీ కే దక్కుతుందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. తనపై లోకేష్ చేసిన ఆరోపణలను నిరూపించాలని.. కావాలంటే తాను పాదయాత్రలో తనతో కలిసి నడుస్తానని సవాల్ చేశారు. తాజాగా ఈ రోజు లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కర్నూలులో పాదయాత్రలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కర్నూలులో జరుగుతోంది. ఈ యాత్రను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ప్రయత్నించారు. యువగళం పాదయాత్ర ఎస్టిబిసి కళాశాల మైదానం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొందరు న్యాయవాదులు అడ్డుకోగా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. అదేసమయంలో ఎమ్మెల్యే హఠాత్తుగా దూసుకువచ్చారు.
మైనార్టీల సమావేశ సభలో నారా లోకేష్ తనపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. తనతో లోకేష్ చర్చకు రావాలని ద్విచక్రవాహనంపై పాతబస్తీలో నారా లోకేష్ యాత్రకు ఎదురుగా వెళ్లారు. పెద్ద ఎత్తున హాఫీజ్ ఖాన్ అనుచరులు సైతం రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా హాఫీస్ ఖాన్ మీసాలు మెలేస్తూ. నారా లోకేష్‌తో పాటుగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దమ్ముంటే.. రా! చర్చిస్తాం.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. అని విమర్శలు గుప్పించారు.
అంతకముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా లోకేష్ పై హఫీజ్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు, ప్రజలకు అందుబాటులో పనిచేసెందుకు అమెరికాలోని లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చిన వ్యక్తి తానని చెప్పారు. తాను స్థలాలు కబ్జా చేశానని ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా అని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు కర్నూల్ పరిధిలో వెలికి తీసి కాపాడే ప్రయత్నం చేసింది తానని తెలిపారు.