వైసీపీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ జాబితాలో ఆనం రాం నారాయణ రెడ్డి కూడా చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆనం రాం నారాయణ రెడ్డి జాయిన్ అయ్యారు. గత ఏడాదిన్నర నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలులేకుండా పోయిందని చెప్పారు. వారికి వాట్సాప్ ఆడియో కాల్ చేయాల్సి వస్తోందని వివరించారు. పార్టీ నేతల ఫోన్లనే ట్యాప్ చేస్తుంటే ఎవరికీ ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు.
తన భద్రతను తగ్గించారని రాం నారాయణ రెడ్డి వాపోయారు. కొద్దీగా ఏంటీ పూర్తిగా భద్రతను తొలగించాలని జగన్ సర్కార్ను కోరారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయించిన ఘటనలు ఇదివరకు ఎన్నడూ వినలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని, తాను లేకుండా చూడాలని కొందరు అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరి దయ మీద తన రాజకీయ జీవితం ఆధారపడి లేదన్నారు.
తనపై ఇంటిలిజెన్స్ నిఘా ఉందని మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డానని, తన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఇప్పటి వరకు 12 సిమ్ కార్డులు మార్చానని వెల్లడించారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మూడుతరాలుగా సేవ చేస్తున్నానని తెలిపారు. తాను ఆశించిన పదవీ దక్కలేదని ఇండైరెక్టుగా చెబుతున్నారు.