Turtles Released into Musurumilli Reservoir : ఓ మినీ వ్యానులో భారీ ఎత్తున తరలిస్తున్న తాబేళ్లను(TURTLES SMUGGLING) పోలీసులు పట్టుకున్నారు. తిరిగి వాటిని ఓ రిజర్వాయర్లో వదిలేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఫోక్స్ పేట ఫారస్ట్ చెక్ పోస్ట్ వద్ద వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పోలీస్ అధికారులు వాహనాలను చెక్ చేస్తున్న సమయంలో ఓ మినీ వ్యాను కనిపించింది. పైకి అందులో ఉల్లిపాయల్ని రవాణా చేస్తున్నట్లుగా ఉంది. వ్యాన్ అంతటినీ పోలీసులు పరిశీలించగా అందులో పెద్ద ఎత్తున తాబేళ్లు(TURTLES) బస్తాల్లో కట్టి ఉండటాన్ని గమనించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఉల్లిపాయల రవాణా మాటున సదరు వ్యక్తులు వీటిని అక్రమంగా ఒడిస్సాకి తరలిస్తున్నారని తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కొందరు వ్యక్తులు వీటిని పట్టుకుని మాంసం కోసం అక్కడికి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. బస్తాల్లో ఏకంగా 1589 తాబేళ్లు ఉన్నాయని చెప్పారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందన్నారు. గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా దొరికే ఈ తాబేళ్లను ఒరిస్సాలో(ODISHA) ఎక్కువగా మాంసం కోసం వినియోగిస్తారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను ముసురుమిల్లి రిజర్వాయర్లో(MUSURUMILLI RESERVOIR) తిరిగి జల ప్రవేశం చేయించినట్లు తెలిపారు.