నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేపు ఎదురుచూసి దర్శించుకున్నారు. మరోవైపు అర్ధరాత్రి దాటిన తర్వాత రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు.
అరసవల్లిలో సూర్యభగవానుడి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా నేడు సూర్యోదయం తర్వాత సూర్యుడి తొలి కిరణాలు నేరుగా స్వామి వారి పాదాలను తాకాయి. ఈ అపురూప క్షణాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.