»The Enforcement Directorate Ed Has Registered A Case Against Ycp Mla Mekapati Vikram Reddy For Defrauding The National Highway Authority Of India Nhai And Collecting The Toll In Advance
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ని మోసం చేసి ముందుగానే టోల్ వసూలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అతని బ్యాంక్ బ్యాలెన్స్, ఖాతాలను సీజ్ చేసింది.
Toll Scam: నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ని రూ.102 కోట్లు వరకు మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేసు ఫైల్ చేశారు. కేఎంసీ కన్స్ట్రక్షన్స్లో డైరెక్టర్‌గా ఉండే విక్రమ్ రెడ్డి మరో రెండు కంపెనీలతో కలిసి కేరళలో జాతీయ రహదారి పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేశారనే ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా హైదరాబాద్‌లోని కేఎంసీ కంపెనీలో ఈడీ సోదాలు జరిపి..దీని వెనుక కుట్ర ఉందని గుర్తించింది.
కేరళలో బీవోటీ పద్ధతిలో నిర్మించే జాతీయ రహదారి కాంట్రాక్టును కోల్‌కతాకు చెందిన భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్(BRNL), గురువాయూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(GIPL) 2006లో దక్కించుకున్నాయి. వీటి నుంచి కేఎంసీ సబ్‌కాంట్రాక్టు పొందింది. ఇందులో రోడ్డు డిజైన్, నిర్మాణం, అభివృద్ధి, ఫైనాన్స్, ఆపరేషన్‌తోపాటు నిర్వహణ బాధ్యతలను కేఎంసీ తీసుకుంది. అయితే రోడ్డు పూర్తికాకుండానే వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఎన్హెచ్ఏఐ అధికారులు, ఇంజినీర్లతో కలిసి పదేళ్ల పాటు టోల్ వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ వెంటనే స్పందించింది. జాతీయ రహదారి 544 పనులు చాలా తక్కువ చేపట్టారు. కానీ దాదాపు రూ.102.44 కోట్ల డబ్బు ఎన్హెచ్ఏఐ నుంచి మోసగించినట్లు తేల్చింది.
బస్ షెల్టర్ల నిర్మాణం, బస్ షెల్టర్లలో ప్రకటనలు, నాసిరకం సర్వీసు రోడ్డు నిర్మాణం, హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహణపై సీబీఐ దర్యాప్తు చేసి.. ఈ కుట్రను గుర్తించింది. రోడ్డు నిర్మాణానికి కేఎంసీ రూ.721 కోట్లు ఖర్చు చేసింది. కానీ రూ.1,250 కోట్లు టోల్ రూపంలో వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో ఈడీ పీఎంఎల్ఏ సెక్షన్ 17(1ఏ) కింద కేసు నమోదు చేసి.. అక్టోబర్ 16న సోదాలు చేపట్టింది. కాంట్రాక్టు కంపెనీకి చెందిన బ్యాంక్ బ్యాలెన్స్, ఎఫ్‌డీలన్నీ కలిపి రూ.125.21 కోట్లు సీజ్ చేసింది. కానీ ఇందులో కేఎంసీ కన్స్ట్రక్షన్ బ్యాంకు బ్యాలెన్స్ రూ.1.37 కోట్లు మాత్రమే ఉందని సీబీఐ గుర్తించింది.