సీబీఐ విచారణకు వెళ్లే ముందు వైఎస్ విజయమ్మను అవినాశ్ రెడ్డి కలవడం వెనుక ఆంతర్యమేమిటని టీడీపీ శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 5 రోజుల గడువు దేనికి అని నిలదీశారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా ముత్యం అని అనివాశ్ రెడ్డిని ఎద్దేవా చేశారు. హత్య కేసు విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్న అవినాశ్ అసలు వివేకానందరెడ్డి హత్య జరిగిన బాత్రూంలో రక్తాన్ని ఎవరు శుభ్రం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ ముగిసిన అనంతరం వైఎస్సార్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. ఈ సందర్భంగా అవినాశ్ పై తీవ్రంగా మండిపడ్డారు.
‘హత్య జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి ఎవరు వెళ్లారు? వెళ్లి ఏం చేశారో కూడా మీడియాకు చెబితే బాగుండేది. ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యకేసును సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును కోరిన మరో ముత్యంరెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసు ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలి. సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు హాజరుకాకుండా 5రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? ఎవరి కాళ్లు, వేళ్లు పట్టుకుని బతిమాలుకోవడానికి సమయం తీసుకున్నారు? 5 రోజులు లాయర్లతో మంతనాలు జరిపి కేసును ఎలా నీరుగార్చాలి? కేసు నుండి ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలపై కుట్రపూరిత ఆలోచనలు చేసిన మాట వాస్తవం కాదా కడిగిన ముత్యం?’ అని రవి ప్రశ్నించారు.
వివేకా హత్య కేసులోని రక్తపు మరకలను చంద్రబాబు చొక్కాకు అంటించి కేసు నుంచి బయటపడాలని చూసి… నువ్వు బొక్కబోర్లా పడిన మాట నిజం కాదా అని బీటెక్ రవి నిలదీశారు. వివేకా కుమార్తె వైఎస్ సునీత కుటుంబంపై హత్యారోపణ చేస్తూ అసత్య వార్తలు, కథనాలు ప్రసారం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం, కుటుంబ పరువు, ప్రతిష్ట ఆ రోజు గుర్తుకు రాలేదా అని తెలిపారు. మీదాకా విమర్శలు, ఆరోపణలు వస్తేనే మీకు కుటుంబాలు, ఆత్మగౌరవం గుర్తొస్తాయా అని పేర్కొన్నారు. కడప ఎంపీ సీటుకోసమే వివేకా హత్య జరిగిందని సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. ఏ ముఖం పెట్టుకుని విజయమ్మను కలిశావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.