ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదని ఈ మాటలను బట్టి అర్థమవుతోందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జగన్ రాజధానిపై ప్రకటన చేశారన్నారు. జగన్ ఈ సదస్సు ద్వారా ఒక్క పైసా పెట్టుబడిని లేదా పరిశ్రమ కానీ తీసుకురాలేకపోయారన్నారు. ఆయనకు ప్రజాదరణ తగ్గినట్లు ఇండియా టుడే సర్వేలో తేలిందని గుర్తు చేశారు. వైయస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయంపై వార్తలు వచ్చిన నేపత్యంలో, తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వివాదాలు సృష్టించడం అలవాటుగా మారిందన్నారు.
జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం కావడం, అవినాశ్ రెడ్డిని విచారించడం వంటి అంశాలు జగన్ను కలవరానికి గురి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే ప్లాన్ ప్రకారం విశాఖ రాజధాని అన్నారని చెప్పారు. హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారో అది కీలకంగా మారిందన్నారు. ఈ కాల్ డేటా దృష్టి మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.