ఆంధ్రప్రదేశ్ లో తెరపైకి వచ్చిన మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను (Visaka) నిర్ణయించారు. వివిధ కార్యాలయాలు తరలిస్తున్నారు… తరలించేందుకు సిద్దమవుతున్నారు. అమరావతిలోని కార్యాలయాలతో పాటు విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఉండిపోయిన పలు కార్యాలయాల్ని విశాఖకు, కర్నూలుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా హెచ్చార్సీతో పాటు లోకాయుక్త వంటి కార్యాలయాలు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్ళాయి. ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు కావాల్సిన మరో కీలక ఆఫీసు ఇప్పుడు విశాఖ వెళ్తోంది.
కార్యాలయం కోసం ప్రయత్నం
ఏపీ-తెలంగాణ విభజన తర్వాత కూడా పదేళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే సమావేశాలకు ఆర్బీఐ అధికారులు హాజరవుతున్నారు. దీంతో ఏపీకి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కేటాయించాలని జగన్ ప్రభుత్వం ఎప్పటి నుండో కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్దమవుతోంది.
భవనం కోసం అన్వేషణ
విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ఇప్పటికే స్ధలాల్ని, భవనాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం కావాలని ఆర్బీఐ కోరుతోంది. అధికారులు అలాంటి భవనం కోసం అన్వేషిస్తున్నారు. భవనం దొరికితే నెల రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నారని తెలుస్తోంది. తొలుత 500 మందితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అనంతరం అదనపు సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ముంబైలో ఆర్బీఐ కేంద్ర కార్యాలయం ఉంటుంది. అలాగే రాష్ట్రాల రాజధానుల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ, విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ దీనిని తరలించాల్సి వస్తే ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతికే తరలించాల్సి ఉంటుంది. త్వరలో సీఎం జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి సచివాలయం తరలింపు కష్టమే. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు అమరావతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవడం గమనార్హం.