KRNL: కర్నూలు ట్రాఫిక్ ఎస్సై మల్లన్న, ఆర్ఎస్సై అహ్మద్ హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి నగర శివారులోని సుంకేశుల రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హైవే వైపు నుంచి వచ్చే వాహనదారులను తనిఖీ చేసి 11 మంది మద్యం తాగినట్లు గుర్తించారు. ఐదు బైకులు, రెండు ఆటోలు, నాలుగు కార్లు సీజ్ చేశారు. సదరు వాహనచోదకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ATP: తాడిపత్రి పరిధిలోని పెద్ద పొడమల గ్రామ సమీపంలో మల్లికార్జున(43) అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఇంఛార్జ్ ఎస్సై నాగప్ప చెప్పారు. పెద్ద పొడమల గ్రామానికి చెందిన మల్లికార్జున గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
SRKL: కాశీబుగ్గ-పలాసలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జవహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో సినర్జిన్ కాస్టింగ్, అపోలో ఫార్మసీ, ఫార్మా సంస్థలు హాజరవుతున్నాయని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువు పూర్తి చేసినవారు అర్హులు. 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా, క్యూ లైన్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అక్కడి విధులలో ఉన్న సిబ్బందికి సీపీ ఆదేశాలిచ్చారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండల కేంద్రంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పామర్రు MLA కార్యాలయ వర్గాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.
విశాఖ: ఈ మధ్య కురిసిన అధిక వర్షాలకు గూడెం కొత్తవీధి మండలంలోని చామగెడ్డ వాగు వద్ద వంతెన కొట్టుకుపోయింది. ఈ సందర్భంగా అక్కడ తాత్కాలిక వంతన నిర్మాణ పనులు ప్రారంభించామని పంచాయతీరాజ్ ఏఈఈ జ్యోతిబాబు తెలిపారు. శనివారం చామగెడ్డ వాగు వద్ద తాత్కాలిక వంతెన పనులను ప్రారంభించారు. వర్షాలకు వంతెన కొట్టుకుపోవడం వల్ల సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు.
VZM: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తమకి అదనపు బాధ్యతలు అప్పగించడం సరికాదని జిల్లాకు చెందిన పలువురు సచివాలయ ఏఎన్ఎంలు వాపోయారు. ఈ సందర్బంగా వారంతా DMHO భాస్కర్ రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించే పనులు తమకి అప్పగించడం వలన ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము ఖాళీగా లేమని తాము అదనపు డ్యూటీలు చేయలేమని పేర్కొన్నారు.
KKD: తుని పట్టణంలోని పురపాలక సంఘం హై స్కూల్ నందు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ప్రముఖ వైద్యులు పలు కంటి వ్యాధులకు చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రకాశం: బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రోమోర్, ఫర్టిలైజర్స్ షాపులను శనివారం మండల వ్యవసాయ అధికారి కుమారి పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులు కొన్న రైతులకు బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఎరువులు, పురుగుమందులు అందించాలని షాప్ యజమానులను ఆదేశించారు. అధిక రేట్లకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని షాపు యజమానులకు తెలియజేశారు.
CTR: భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి అని భక్తుల నమ్మకం. ఆదివారం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లికి గ్రామ బోనాల సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. మార్చి నెలలో జరిగే గంగమ్మ జాతరను తలపించేలా ఈ గ్రామ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
శ్రీకాకుళం: ఇచ్చాపురం మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉందని అక్కడ స్థానికులు ఆదివారం పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో తలపెట్టిన జలజీవన్ మిషన్ పథకం కూడా ఈ సమస్యను గట్టెక్కించలేదని వాపోయారు. ముఖ్యంగా A.S పేట, పురుషోత్తపురంలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న జనాభాకు అది సరిపోవట్లేదని అన్నారు.
విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోందని మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. హుకుంపేట మండలంలోని గూడ పంచాయతీ కేంద్రంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేసిన పనులు, అభివృద్ధి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 4 వేలకు పెంచిందని తెలిపారు.
శ్రీకాకుళం: టెక్కలి పాత హైవేపై రోడ్డు ఆక్సిడెంట్లో ఓ యువకుడు శనివారం సాయంత్రం మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన రావివలస మల్లేశ్వరరావు(32) అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంతబొమ్మాళికి వచ్చి తిరిగి వెళ్తుండగా టెక్కలి ఆట్ నుంచి దూకి తప్పించుకునే క్రమంలో లారీ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
SKLM: జిల్లాలో సక్రమంగా విధులకు హాజరుకాని 17 మంది హోంగార్డులకు ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం నోటీసులు జారీ చేశారు. ఈ 17 మంది సెప్టెంబరు 23 ఆదివారం ఉదయం 10 గంటలకు ఎచ్చెర్లలోని (ఆర్మ్ డ్ రిజర్వుడ్) ఏ. ఆర్ మైదానానికి రావాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు.
విశాఖ: ప్రజా పోరాటాలతోనే ఏజెన్సీ అభివృద్ధి చెందుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స శనివారం అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజలు మిశ్రమంగా స్పందిస్తున్నారన్నారు. ఏజెన్సీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైనా సూపర్ సిక్స్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.