తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమని, ఈ రెండు పార్టీలకు త్వరలో మూడో పార్టీ కూడా కలుస్తుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావమే లేకుంటే, సొంత పేపర్లో అధికార పార్టీ అలా అక్కసు వెళ్లగక్కదన్నారు. ఈ రెండు పార్టీల కలయికతో అధికార పార్టీ గందరగోళానికి గురవుతోందని, ఆ పార్టీలకు నిజంగానే బలం లేకుంటే జగన్ ప్రభుత్వానికి తత్తరపాటు అవసరం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత వైసీపీ నాయకులు ఎంతగా ఉలిక్కిపడ్డారో, అలాగే గతంలోను వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోయాయని విమర్శించారు.
జగనన్న తోడు పథకం కొత్తదేమీ కాదని, ఈ పథకం ప్రచారం కోసమే రూ.4 కోట్ల వరకు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం విడ్డూరమన్నారు ఎంపీ రఘురామ. ప్రధాని మోడీ కరోనా కాలంలో ఆత్మనిర్భర్ పథకం ప్రవేశపెట్టారని, చిరు వ్యాపారుల కోసం దీనిని తీసుకు వచ్చారని గుర్తు చేశారు. అసలు జగన్ అధికారంలో లేకుంటేనే మరిన్ని పథకాలు వస్తాయన్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులకు కనీసం గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, కానీ మన పార్టీలలో ఎంపీలకే సభ్యత్వం లేదని ఎద్దేవా చేశారు. సాక్షి పేపర్లో వేర్ ఈజి ది పార్టీ అని టీడీపీ గురించి ఓ కథనం రాశారని, టీడీపీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురిని వైసీపీ లాగేసుకున్నదని, జగన్ గొప్పవాడు కాబట్టి రాజీనామా చేయకుంటే పార్టీలో చేర్చుకోరని, కానీ వారు రాజీనామా చేసి, తిరిగి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు కాబట్టి స్పీకర్‌కు చెప్పి ప్రత్యేక స్థానాలు కేటాయించారని విమర్శించారు. పార్టీలో చేరిన వారిని కలుపుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు రఘురామ.