»Kanna Lakshminarayana Resings From Bjp Will Join Janasena
Kanna resigns BJP: బీజేపీకి కన్నా రాజీనామా, ఇప్పుడేం మాట్లాడనన్న జీవీఎల్
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నాళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఎనిమిదే ళ్ల తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ పెద్దలపై ఆయనకు ఎలాంటి అసంతృప్తి లేకపోయినప్పటికీ.. రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన గుంటూరులో తన అనుచరులతో భేటీ అయ్యారు. రాజీనామా చేస్తున్నట్లు కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పొసగడం లేదని, ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే రాజీనామాపై ఆయన అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. మనకు సానుకూలంగా ఉన్న పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) దోస్తీకి రాష్ట్ర నాయకత్వం ముందుకు రాకపోవడం పట్ల ఆయన ఆవేదనతో ఉన్నారట. బీజేపీని (BJP) వీడిన తర్వాత ఆయన జనసేన (Janasena) లేదా తెలుగు దేశం (Telugudesam) పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తీరు పట్ల కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 నుండి 2020 వరకు కన్నా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసారు. ఆయన వేసిన పలు కమిటీలను, జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించి, తన వర్గీయులను నియమించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశాలను ఆయన ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు ఉండటంతో అగ్ర నాయకత్వం ఏపీ పైన మరీ అంతగా దృష్టి సారించడం లేదు. కొద్ది రోజులుగా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. పార్టీ అధ్యక్షులు సోము పైన కన్నా తీవ్ర విమర్శలు చేసినప్పటికీ… మాజీ మంత్రి కావడం, కాపులలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత కారణంగా పార్టీ ఏం చేయలేకపోయింది. కానీ ఇప్పుడు కన్నా తనంతట తానే పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
సోము కారణంగా కన్నా అసంతృప్తిని గమనించిన పార్టీ పెద్దలు సాధ్యమైనంతగా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ పెద్దలు వచ్చి ఆయనను రెండుమూడుసార్లు కలిశారు. అంతా సర్దుకుంటున్న సమయంలో సోముకు పలువురు పెద్దలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని కన్నా జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది. కన్నా కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచిన వ్యక్తి. విభజన తర్వాత కొన్నాళ్లకు బీజేపీలో చేరిన ఆయనకు 2018లో పార్టీ బాధ్యతలు అప్పగించారు. 2020 నుండి సోము అధ్యక్షుడిగా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాకు సిద్ధపడ్డారన్న వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నర్సింహా రావు స్పందించేందుకు నిరాకరించారు. రాజీనామా కన్ఫర్మ్ అయ్యాక తాను స్పందిస్తానని, పార్టీ ద్వారా స్పందన ఉంటుందని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. కన్నాను కొనసాగించేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదా అని మీడియా అడిగిన ప్రశ్నకు… అన్నీ తర్వాత మాట్లాడుతామన్నారు. ప్రస్తుతం తాను ఏ విషయాన్ని చెప్పే పరిస్థితి లేదన్నారు. అంతకుముందు ఆయన కాపు సంఘాల నేతలతో భేటీ అయ్యారు.