»Jana Sena Candidates Contesting Those Seats In Ap
Pawan kalyan: దూకుడు పెంచిన పవన్.. ఆ స్థానాల్లో పోటీకి సిద్ధం
ఏపీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల గురించి పవన్ సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో 25 నుంచి 40 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ తరుణంలో పవన్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. జనసేన (janasena) పోటీ చేసే స్థానాలకు సంబంధించి పవన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ఈ తరుణంలో వారం రోజులుగా ఆయన మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మకాం వేశారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల గురించి అడిగిమరీ తెలుసుకుంటూ వస్తున్నారు.
టీడీపీతో పొత్తులో భాగంగానే తాము పోటీ చేయబోయే స్థానాల పరిధిలోని నియోజకవర్గాలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్లుగా జనసేన వర్గాలు తెలిపాయి. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంపై ఒక స్పష్టతను మాత్రం పవన్ ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. 175 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి పోరులో 25 నుంచి 40 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం పవన్ కసరత్తు చేస్తున్నారు.
సీట్ల పంపకాలకు సంబంధించి కూడా పవన్ చంద్రబాబుతో ఇప్పటికే భేటీ అయ్యి ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసమే గత వారం రోజులుగా పలు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. జనసేన పోటీ చేయాలని భావిస్తున్న తిరుపతి, ఒంగోలు, గుంటూరు వెస్ట్, తెనాలి, మచిలీపట్నం, అవనిగడ్డ, కొత్తపేట, అమలాపురం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, భీమిలి, ఎలమంచిలి, పెందుర్తి, నెలిమర్ల నియోజకవర్గాల పరిధిలో జనసేన అభ్యర్థులను నింపేందుకు పవన్ ప్రణాళిక వేస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా పవన్ చేయనున్నారు.