తెలుగుదేశం పార్టీ హయాంలో కరువు విలయ తాండవం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న కొన్ని వార్తా సంస్థలు ప్రచురించడం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మీడియాకు వెల్లడించారు. టీడీపీ హయాంలో పంటలు పండించకపోవంతో కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ పాలనలో ఇప్పుడు కరువు మండలాలే లేవని చెప్పారు. చంద్రబాబు అధికారం చేపడితే చాలు కరువు విలయ తాండవం చేస్తుందన్నారు.
వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రైతులకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నామని వివరించారు. రైతు భరోసా కేంద్రాలను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చెల్లించని విధంగా ఒకే ఏడాది 2,987 కోట్లు భీమా చెల్లించామని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో కంటే ఏడాదిలో 14 లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా ఉత్పత్తి పెంచామన్నారు. రైతులకు 175 రకాల ట్రాక్టర్ మోడల్స్ అందజేశామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రైతు రథం పేరుతో ట్రాక్టర్ కు లక్ష రూపాయల చొప్పున జేబులో వేసుకున్నారని విమర్శించారు.
కౌలు రైతులకు, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి కాకాణి స్పష్టంచేశారు. తెలుగుదేశం హయాంలో కరువుతో విలయతాండవం చేసిందన్నారు. ఇప్పుడు జలాశయాల్లో జలకళ నెలకొందన్నారు. రైతుల గురించి మాట్లాడే లోకేష్ అసలు పంటలను గుర్తు పట్టగలడా అని విమర్శించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పార్టీలో చిన్న సమస్యలు ఉంటాయని మంత్రి కాకాణి చెప్పారు. సమస్యను అధిష్టానం పరిష్కారిస్తోందని తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీలో ఉన్న సమస్యలు టీ కప్పులో తుఫాను లాంటివని చెప్పారు. ప్రభుత్వం ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయదన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారతారని ఎక్కడా చెప్పలేదని.. వదంతులు మీడియా సృష్టి అని కొట్టి పారేశారు.