ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…. రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన… ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ సమావేశం కానున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశముందని సమాచారం. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశముందని చెబుతున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల విషయంపై జగన్ చర్చించే అవకాశాలున్నాయని సమాచారం అందుతుంది. మోదీతో పాటు అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశముందని తెలిసింది. ఇక ఈ నెలలో సీఎం జగన్ ఢిల్లీపర్యటన ఇది రెండవసారి కావడం వల్ల ప్రధానితో ఎటువంటి విషయాలు చర్చకు వస్తాయనేది ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.
దీంతో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28వ తేదీన నర్సీపట్నం రానున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి, ఏలేరు–తాండవ అనుసంధాన పనులకు సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.