Andhra Pradesh: తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పార్టీలు జోరుగా ఉన్నాయి. తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించారు. ఏపీలో కూడా ప్రజలు వైసీపీని ఓడిస్తారని తెలుగుదేశం, జనసేన పార్టీలు భావిస్తున్నాయి. ఈక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలని చర్చలు కూడా కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో రెండు చోట్ల పోటీ చేసి సత్తా చాటాలని చూస్తోంది. కడపలో రాజంపేట, కోడూరు జనసేనకు కేటాయించాలని టీడీపీ భావిస్తోంది.
రెండు అసెంబ్లీ స్థానాలపై జనసేన నేతలు దృష్టి సారిస్తున్నారు. రాజంపేట నుంచి టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేసేందుకు ఇద్దరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ కేటాయించినా బరిలో దిగేందుకు అవసరమైన కార్యాచరణలో ఎవరికి వారు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వ అధికారి పదవికి రాజీనామా చేసిన యల్లటూరు శ్రీనివాస్ రాజు కొద్ది రోజుల క్రితమే జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ఆయన రెండు రోజుల క్రితం రాజంపేట నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయన రాజంపేట నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రాజంపేట అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం ముగ్గురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ చెంగల్ నాయుడు టికెట్ రేసులో ఉన్నారు. ఈయనతో పాటు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి రాజంపేట్ టికెట్ జనసేనకు వెళ్తుందా? టీడీపీకి వస్తుందా? తెలియాలంటే కొన్నిరోజులు వేచియుండాల్సిందే.