బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వానికి ఇక్కడి నుండి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, మేమంతా కలిసి బీజేపీని ఎదుర్కొంటామన్నారు. నిరుద్యోగం రికార్డ్ స్థాయిలో పెరిగిందని, ఇందుకు యూపీ నిదర్శనం అన్నారు. మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ వ్యయాన్ని రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు మరో 400 రోజులు మాత్రమే ఉన్నాయని మోడీ చెప్పారని గుర్తు చేశారు. అంటే కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటున్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
తెలంగాణలో బీజేపీని కేసీఆర్ ఓడించాలని, ఉత్తర ప్రదేశ్ తాము ఆ పని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీ-20 అధ్యక్ష పదవిని కూడా బీజేపీ తన ప్రచారానికి ఉపయోగించుకుంటుందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చేతులెత్తేశారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రక్షాళన జరుగుతున్నట్లుగానే ఉత్తర ప్రదేశ్లోను జరుగుతోందన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అందరం కలిసి ముందుకు సాగితే బీజేపీని గద్దె దించవచ్చునని చెప్పారు.
తెలంగాణలోని కలెక్టరేట్లు ఇక్కడి అభివృద్ధికి నిదర్శనమన్నారు. కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నారని కితాబిచ్చారు. చారిత్రక ఖమ్మం ఇప్పుడు జనసంద్రంగా మారిందన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని ప్రశంసించారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. యాదాద్రిని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని చెప్పారు. కేసీఆర్ పని ఎక్కువగా, ప్రచారం తక్కువగా చేసుకుంటున్నారన్నారు. ఖమ్మం ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతులు అన్నారు.