»A Tearful Chandrababu Arrived At His Residence In Jubilee Hills Today
Chandrababu: కంటతడి పెట్టుకున్న చంద్రబాబు..నేడు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి రాక
మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన కుటుంబీకుల ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. తన సతీమణి భువనేశ్వరి కన్నీళ్లను చూసి తాను కూడా కంటతడి పెట్టుకున్నారు. కాగా నేడు ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి సాయంత్రం చేరుకోనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement scam Case)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 52 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. తమ అధినేత జైలు నుంచి బయటకు రావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని ఆయనకు గన స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
సుమారు 13 గంటల పాటు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి అయినా కూడా చంద్రబాబు (Chandrababu) ప్రయాణిస్తున్న మార్గంలో దారి పొడవునా టీడీపీ (TDP) శ్రేణులు, అభిమానులు బాబుకు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 6 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి బాబుకు హారతి ఇచ్చి స్వాగతం పలికింది.
బాబుకు ఇంటికి చేరిన సమయాన కుటుంబీకులు, బంధువులు ఆయన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో వారిని చూసి చంద్రబాబు కూడా కంటతడి పెట్టుకున్నారు. బాబు భావోద్వేగపు క్షణాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబు తన బంధువులను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అందర్నీ ధైర్యంగా ఉండాలంటూ సూచించారు.
నేడు చంద్రబాబు హైదరాబాద్ (Hyderabad)కు విచ్చేయనున్నారు. వాస్తవానికి నేడు ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే తిరుమల పర్యటనను రద్దు చేసుకుని సాయంత్రం నేరుగా ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో నేటి చంద్రబాబు షెడ్యూల్ విడుదలైంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బాబు బయల్దేరి 3.45 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని 4.45 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు. 5.50 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.