Signs of Vitamin C deficiency : మనం ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్ సీ(Vitamin C) పాత్ర కీలకమైనది. అది మనలోని రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. యవ్వనంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. శరీరంలోని కణ జాలాన్ని వృద్ధి చేయడంలో సహకరిస్తుంది. నష్టపోయిన కణాలకు సమానంగా కొత్త కణాలు వచ్చేలా చూస్తుంది. శ్వాస కోశ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. చర్మంపై ముడతలు లేకుండా చేసి కాంతివంతంగా ఉంచుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే విటమిన్ సీ అనేది మన శరీరానికి అతి ముఖ్యమైన విటమిన్ అని చెబుతారు. అయితే సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల కొన్ని సార్లు మనలో దీని లోపం తలెత్తుతుంది. ఆ విషయాన్ని కొన్ని సూచనల ద్వారా శరీరం మనకు చెబుతూ ఉంటుంది.
చర్మంపై ఏది తగిలినా ఊరికే గాయాలు అవుతాయి. రక్త స్రావం అవుతుంది. గాయాలు తొందరగా తగ్గవు. చర్మం కింద భాగంలో ఉండే రక్త నాళాల నుంచి ఏ కొంచెం ఒత్తిడి కలిగినా రక్తం బయటకి వస్తుంది. చర్మం అడుగున ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. అందువల్ల చర్మంపై అక్కడక్కడ ముదురు ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. అలాగే కీళ్ల దగ్గర వాపులు వస్తాయి. వీటి దగ్గర ఉండే కణ జాలాలకు కొలాజిన్ అవసరం. సీ విటమిన్ లోపం(Vitamin C deficiency) వల్ల శరీరంలో కొలాజిన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. అందువల్ల కీళ్ల దగ్గర వాపులు, నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
విటమిన్ సీ శరీరంలో తక్కువైతే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వాపులు, రక్తస్రావం కనిపిస్తాయి. పళ్లు బలహీనంగా మారి కదిలిపోతాయి. అలాగే గోళ్ల మధ్యలో గుంటలు పడినట్లై, పెళుసుబారినట్లు అవుతాయి. చూడ్డానికి అవి స్పూన్‌లా అనిపిస్తాయి. మరి కొందరికి గోరు లోపలి నుంచి ఎర్రటి మచ్చలు కనిపిస్తుంటాయి. అలాగే చర్మంలో నిగారింపు తగ్గిపోతుంది. డ్యామేజై రఫ్‌గా మారినట్లు అవుతుంది. ముడతలు పడినట్లు అవుతుంది. ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తుంటే జామపళ్లు, నిమ్మ, నారింజ, కమల, స్రాబెరీ, బొప్పాయి, కివి, చెర్రీలు వంటి వాటిని ఎక్కువగా తినాలి.