»Pakistan Election Results Nawaz Sharifs Party Offered Coalition
Pakistan elections : పాక్‌లో సంకీర్ణం ఏర్పాటు దిశగా నవాజ్ షరీఫ్ అడుగులు!
పాకిస్థాన్ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో పాక్ మాజీ ప్రధాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పాములు కదుపుతున్నారు.
Pakistan Election Result 2024 : పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడ ఏ పార్టీకీ కూడా పూర్తి ఆధిక్యం రాలేదు. దీంతో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్(PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు విజయవంతం అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
పాకిస్థాన్ పీపుల్స్‌పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ , అసిఫ్ అలీ జర్దారీలతో జరిపిన చర్చల్లో ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణం ఉన్నట్లు పీఎంఎల్ – ఎన్ ప్రకటించింది. ప్రస్తుతం పాక్‌లో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుని ఉందని దీని నుంచి దేశాన్ని బయట పడేసేందుకు రెండు పార్టీలు కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను(Election Result) అక్కడి ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం… అక్కడ మొత్తం 265 జాతీయ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో పీఎంఎల్ – ఎన్‌కు 75, పీపీపీ కి – 54, ఎంక్యూఎం-పీ కి 17 సీట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే 133 సీట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు సాథ్యం అవుతుంది.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ తరఫున స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు వచ్చాయి. వీరిలో ఎవరెవరు కలిసి చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.