YS sharmila: సీఎం రేవంత్ రెడ్డి చెంతకు జగనన్న బాణం..అందుకేనా?
తన కుమారుడి వివాహం సందర్భంగా వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. పెళ్లికి తప్పకుండా రావాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో శనివారం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి విచ్చేసిన వైఎస్ షర్మిలకు శాలువా కప్పి సత్కరించారు.
వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని సీఎంను ఆమె కోరారు. కాబోయే వధూవరులకు ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనవరి 18వ తేదిన రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదిన వారి వివాహాన్ని నిశ్చయించారు. దీంతో కుమారుడి పెళ్లి పనుల్లో వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. ప్రముఖులకు ఆమె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తూ వస్తున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ను కూడా ఆమె కలిసి పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.