ముందు 500 కోట్ల దగ్గరే అనిమల్ ఆగిపోతుందని అనుకున్నారు. ఆ తర్వాత మహా అయితే 700 కోట్ల దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. కానీ ఇప్పుడు అనిమల్ స్పీడ్ చూస్తుంటే.. వెయ్యి కోట్ల మార్క్‌ను ఈజీగా టచ్ చేసేలా ఉంది.
ఓ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే ఎలా ఉంటుందో.. గత పది రోజులుగా చూపిస్తునే ఉంది యానిమల్. డిసెంబర్ 1న రిలీజ్ అయిన యానిమల్ పై కాసుల వర్షం కురుస్తోంది. విమర్శలు, ప్రశంసలను వసూళ్లుగా మార్చుకొని దూసుకుపోతోంది. రణబీర్ కపూర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవడమే కాదు.. మరో వెయ్యికోట్ల వైపు దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన యానిమల్ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైంది. అన్ని భాషల్లో కలిపి ఫస్ట్ వీక్‌లో 340 కోట్ల షేర్ రాబట్టిన యానిమల్.. రెండోవారంలో 8వ రోజు 23 కోట్లు, 9వ రోజు 35 కోట్లు, 10వ రోజు 36 కోట్లు రాబట్టి.. మొత్తంగా 445 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
కేవలం హిందీ వెర్షన్‌కే 390 కోట్ల నెట్ కొల్లగొట్టింది. ఇక తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కలిపి 50 కోట్లకుపైగా నెట్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ లెక్కల ప్రకారం.. 10 రోజుల్లో 717 కోట్లు రాబట్టింది. ఇక సెకండ్ వీక్ మండే రోజున కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. అన్ని భాషల్లో 40 శాతం ఆక్యుపెన్సీ మైంటేన్ చేస్తూ.. 11వ రోజు 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటివరకు 737 కోట్లు వసూలు చేసింది. మరోవైపు ఓవర్సీస్ రికార్డులు తిరగరాస్తోంది యానిమల్.
ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. దీంతో ఈ సంవత్సరంలో పఠాన్, జవాన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది యానిమల్. ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తే.. ఈ వారంలోనే యానిమల్ 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అదే జరిగితే సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. మరి లాంగ్ రన్లో యానిమల్ ఎంత రాబడుతుందో చూడాలి.