Meta, Open AIతో మరోసారి పోటీ పడేందుకు, Google తన AI మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనికి 'జెమిని' అని పేరు పెట్టింది. ఈ టూల్ ఇతర AI చాట్బాట్ల కంటే చాలా రెట్లు మెరుగైనదని Google పేర్కొంది. అయితే ఇది ఎలాంటి పనులు చేయగలదు? దీని ఫీచర్లు ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ప్రస్తుతం భవిష్యత్తు టెక్నాలజీ అని పిలవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో AI టెక్నాలజీ సమాజంలో పెద్ద పాత్రను పోషించబోతోంది. ఇప్పటికే ఈ రంగంలోకి ఒక సంవత్సరం క్రితం వచ్చిన OpenAI ఆధ్వర్యంలో ChatGPT సంచలనం సృష్టించింది. చాట్‌బాట్ AI శక్తిని ప్రపంచానికి బహిర్గతం చేసింది. తాజాగా చాట్ జీపీటీ వంటి వాటికి పోటిగా గూగుల్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గూగుల్ కొత్త AI మోడల్ జెమినిని విడుదల చేసింది. ఇది ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన, సామర్థ్యం గల AI మోడల్ అని గూగుల్ చెబుతోంది. ఈ జెమిని(Gemini) టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలు, కోడ్లను త్వరగా ప్రాసెస్ చేయగలదని, మరింత ఖచ్చితమైన ఫలితాలను అందించగలదని గూగుల్ వెల్లడించింది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఒకే సమయంలో అనేక పనులను చేయగలదు. అంటే వినియోగదారుని కోసం ఒకే సమయంలో చిత్రాలు, వీడియోలు, టెక్స్ట్, కోడ్‌పై పని చేయగలదు. ఇది జెమిని అతిపెద్ద ప్లస్ పాయింట్ అని కంపెనీ తెలిపింది. ఇది సృష్టించడమే కాకుండా టెక్స్ట్, కోడ్, చిత్రాలను కూడా ఒకే సమయంలో చదవగలదని ప్రకటించారు. అయితే ChatGPTలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది టెక్స్ట్‌లో మాత్రమే పని చేస్తుంది. ChatGPTతో వినియోగదారు చిత్రాలను సృష్టించలేరు లేదా చిత్రాలను చదవలేరు.
మరో విశేషమేమిటంటే గూగుల్(google) దీనిలో మూడు మోడళ్లను ప్రవేశపెట్టింది. జెమిని అల్ట్రా, జెమిని ప్రో, జెమిని నానో. జెమిని అల్ట్రా అనేది కష్టతరమైన ఉద్యోగాల కోసం రూపొందించబడిన టాప్ సైజు మోడల్. ప్రో మోడల్ టాస్క్‌ల వంటి పెద్ద శ్రేణి స్కేలింగ్ కోసం రూపొందించబడింది. నానో మొబైల్ పరికరాలు మొదలైన వాటి కోసం నానో మోడల్ రూపొందించబడింది.
జెమిని AI మాసివ్ మల్టీ టాస్క్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ (MMLU) మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. ఇది బెంచ్‌మార్క్‌లపై మానవ నిపుణుల కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదని చెప్పింది. ఇది సమస్య పరిష్కారం కోసం గణితం, భౌతిక శాస్త్రం, చరిత్ర, చట్టం, వైద్యం, నీతి వంటి 57 విషయాల నుంచి సమాచారాన్ని ఉపయోగించుకుంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి మరి.