తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు పలు దేశాల్లో మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో కరోనా కేసులు అధికంగా పెరగడం వల్ల 5 రోజులు లాక్ డౌన్ విధించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్యాంగ్యాంగ్ లో బుధవారం నుంచి లాక్ డౌన్ నియమాలు పాటించనున్నారు.
ఉత్తరకొరియా ఇచ్చిన నోటీసులో అధికారులు శ్వాసకోశ వ్యాధి అని తెలిపారు. కానీ అక్కడ కరోనానే ఎక్కువగా వ్యాపిస్తోందని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో లాక్ డౌన్ గురించి ప్రజలకు ముందే సమాచారం ఇవ్వడంతో అక్కడి ప్రజలు మంగళవారమే పెద్దమొత్తంలో సరుకులు కొనుగోలు చేసినట్లు ఉత్తర కొరియా మీడియా తెలుపుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల గురించి మాత్రం ఉత్తరకొరియా రహస్యంగానే ఉంచుతోంది. గత ఏడాది వరకూ తమ దేశంలో కరోనా వైరస్ ప్రవేశింలేదని ఈ దేశం ప్రపంచ దేశాలకు వినిపించింది. అయితే ఆ దేశంలో కరోనా కేసులు భారీగానే ఉన్నట్లు సమాచారం.