»If Congress Comes 24 Hours Free Electricity Will Adopt Adilabad Revanth
Revanth Reddy: కాంగ్రెస్ వస్తే 24 గంటల ఉచిత విద్యుత్..ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా: రేవంత్
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ విజయభేరి సభ జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బోథ్ ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని గెలిపిస్తే 24 గంటల పాటు ఉచితంగానే విద్యుత్ ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ వద్ద కాంగ్రెస్ విజయభేరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)ను తాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ (Sonia Gandhi) ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ (KCR) పరామర్శించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అన్నీ సమస్యలే తలెత్తాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ‘మహాలక్ష్మి పథకం’ (Mahalakshmi Scheme) ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500లను అందజేస్తామన్నారు.
సోనియాగాంధీ (Sonia Gandhi) నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, మోదీ (Modi), కేసీఆర్ (KCR) కలిసి ఆ ధరను రూ.1200కు చేర్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వల్ల బోథ్ (Boath)కు నీళ్లు రాలేదని, చాలా మంది అన్యాయమైపోయారని ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 31వ తేదిలోపు బోథ్ (Boath) ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తెలంగాణను మోసపోకుండా చూడాలని, కుటుంబ పాలనను తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి కోరారు.