»Medigadda Barrage Collapse Center Once Again Letter To The State
Medigadda Barrage కుంగుబాటు..రాష్ట్రానికి కేంద్రం హెచ్చరిక
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయింది. దీనికి గల కారణం ఏంటో వివరణ ఇవ్వమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకు లేఖ రాసింది. కానీ వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది.
Medigadda Barrage: తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఈ నెల 21న కుంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ బ్యారేజీని ఈ నెల 24న పరిశీలించింది. అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం ఈ పరిశీలనలో పాల్గొంది. బ్యారేజీకి చెందిన 20వ పిల్లర్‌ను ఈ బృందం పరిశీలించింది. 20వ నెంబర్ పిల్లర్ ఐదు అడుగుల మేర కుంగిపోయిందని తెలిపింది. 15నుంచి 20వ పిల్లర్ల వరకు పరిశీలించారు. కానీ ఎక్కువగా 19, 20 పిల్లర్లు మధ్య జరిగిందని తెలిపారు. ఈక్రమంలో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై మేము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రేపటిలోగా వివరణ ఇవ్వాలని లేఖలో తెలిపింది. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం మొత్తం 20ప్రశ్నలకు వివరణ కోరింది. మూడు ప్రశ్నలకు మాత్రమే అధికారులు సమాధానం ఇచ్చారని తెలిపింది. రేపటిలోగా అన్ని ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు లేవని భావిస్తాం. మీరు పంపే సమాధానాలు బట్టి తర్వాత మా నిర్ణయాలు ఉంటాయని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.