మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన కామెంట్లను జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఖండించారు. వెంటనే బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Khushbu: సినీ నటి, ఏపీ మంత్రి ఆర్కే రోజాపై ఇటీవల టీడీపీ నేత బండారు సత్యనారాణ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో రోజా అంటూ హద్దుమీరారు. బతుకు తెలుసు అంటూ లిమిట్ దాటి మరీ మాట్లాడారు. ఆ వెంటనే రోజా కౌంటర్ ఇచ్చారు. మహిళలపై ఇలానా మాట్లాడేది అని విరుచుకుపడ్డారు. మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెకు చాలా మంది నేతలు అండగా నిలబడ్డారు. ఇప్పుడు నటి, బీజేపీ నేత, జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Khushbu) వంతు వచ్చింది.
రోజాపై బండారు చేసిన కామెంట్లను ఖండించారు. అతను చేసిన వ్యాఖ్యలు దారుణం అని.. జుగుప్సాకరంగా మాట్లాడటం సరికాదని సూచించారు. మహిళలను దూషించడం తన జన్మ హక్కుగా బండారు సత్యనారాయణ అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. మహిళ మంత్రిపై చేసిన కామెంట్స్ భద్రతకు, దిగజారుడు తనానికి నిదర్శనం అని మండిపడ్డారు. మహిళలను గౌరవించే వారు ఇలా మాట్లాడరు అని విరుచుకుపడ్డారు. నేతగా కాదు.. ఓ మనిషిగా కూడా నిలవలేదని తెలిపారు.
మంత్రి రోజాకు ఖుష్బూ మద్దతు ప్రకటించారు. వెంటనే రోజాకు బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెప్పకపోతే.. రోజా అభిమానులు చేసే పోరాటంలో తాను కూడా భాగస్వామిని అవుతానని ప్రకటించారు. మహిళల రిజర్వేషన్ కోసం ప్రధాని మోడీ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వారు మహిళా నేతలపై చేసిన కామెంట్స్ సరికాదన్నారు.
మంత్రి రోజాపై బండారు కామెంట్స్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ను కూడా దూషించారని ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.