Rain alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..3 రోజులు వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు మరికొన్ని చోట్ల భారీ వానలు కూడా కురియనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాల జాడ లేకుండా పోయింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయి. ఈ ఏడాదిలో జూలై చివరి వారంలో వర్షాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే కురిశాయి. అయితే గత 15 రోజులుగా వరుణుడు సైలెంట్‌గా ఉన్నాడు. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. తాజాగా, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 14 నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో వాతావరణంలో గత రెండు రోజులుగా మార్పు కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇటీవలి కాలంలో ఎండలకు కాస్త ఉలిక్కిపడిన నగర ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది. ఉక్కపోత నుంచి ఉపసమనం కలిగింది. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలను తనవైపు తిప్పుకోనుంది. ఆ మేఘాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఆవరించగా, తెలంగాణలో ఆగస్టు 14 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో ఆగస్టు 14 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఏపీలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని.. అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం రాయలసీమలో లేదని, అక్కడ వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని తెలిపారు. బంగాళాఖాతంలో చెన్నై సమీపంలో స్వల్ప వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.